దుబ్బాక ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. సత్తా చాటడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న ప్రధాన పక్షాలు.. క్షేత్రస్థాయిలో దూకుడు పెంచాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ ఆధిక్యమే లక్ష్యంగా తెరాస గ్రామాల వారీగా పక్కా వ్యూహంతో రంగంలోకి దిగగా, భాజపా, కాంగ్రెస్‌లు తమ సత్తా నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాయి. 2018 ఎన్నికల్లో తెరాస నుంచి 62,500 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార తెరాస రామలింగారెడ్డి సతీమణిని రంగంలోకి దించే అవకాశం ఉండగా, భాజపా నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన రఘునందన్‌రావు పేరు దాదాపు ఖాయమైనట్లే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కసరత్తును ముమ్మరం చేసింది.
నోటిఫికేషన్, అభ్యర్థుల ఎంపికతో సంబంధం లేకుండా ప్రచారం
నోటిఫికేషన్, అభ్యర్థుల ఎంపికతో సంబంధం లేకుండా తెరాస గ్రామాల వారీగా కార్యక్రమాలు ప్రారంభించింది. మంత్రి హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. లక్ష ఓట్ల ఆధిక్యం రావాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, వివిధ సంస్థల ఛైర్మన్‌లను మండలాలవారీగా బాధ్యులుగా నియమించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గ్రామాలవారీగా బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల తలెత్తిన అసంతృప్తిని చల్లారుస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని విపక్షాల నాయకులు పేర్కొంటున్నారు. అది ఈ ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడవుతుందని అంటున్నారు.