కమీషన్ల కోసమే తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం: ఉత్తమ్ కమీషన్ల కోసమే తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం కొండపోచమ్మ సాగర్ పంట కాల్వను ఆయన పరీశీలించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా శివారువెంకటాపూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ పంట కాల్వకు గండి పడి ఇళ్లల్లోకి నీరు చేరింది. గ్రామమంతా జలమయమైంది. గండి పడిన ప్రాంతాన్ని ఉత్తమ్‌తోపాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
దశాబ్దాల కిందట మట్టితో నిర్మించిన నాగార్జున సాగర్ కాలువలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని పేర్కొన్నారు. సిమెంట్‌తో నిర్మించిన కొండపోచమ్మ కాలువలు ప్రారంభించిన నెలరోజుల్లోనే గండి పడటం నాణ్యత నాసిరకం పనులకు నిదర్శమని మండిపడ్డారు.
కేసీఆర్ కొవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించి.. కొండపోచమ్మ జలాశయాన్ని ప్రారంభించి.. గొప్పలు చెప్పుకున్నారని అభిప్రాయంవ్యక్తం చేశారు.సీఎం వ్యవసాయ క్షేత్రానికి సమీపంలోనే కాలువకు గండి పడితే.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపంపై ముందు నుంచే హెచ్చరిస్తున్నామని చెప్పారు. పంట కాల్వకు గండిపై ఈఎన్‌సీ హరిరాం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. నిర్లక్ష్యంగా మాట్లాడిన ఈఎన్‌సీ హరిరాంను వెంటనే సస్పండ్ చేయాలని డిమాండ్ చేశారు. గండికి సంబంధించిన పరిహారాన్ని ఈఎన్‌సీ జీతం నుంచి వసూలు చేయాలని కోరారు. 24 గంటలైనా బాధితులకు పరిహారంపై కలెక్టర్ స్పందించలేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్