గజ్వేల్లో 17న జరగనున్న దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా(DALITHA GIRIJANA ATMA GAURAVA DANDORA) సభలో దండుకట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దండయాత్ర చేస్తామని... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ బలవంతుడేమీ కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితులకు తీరని అన్యాయం జరిగిందని రేవంత్ వెల్లడించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని... ఇంతవరకు తట్ట మట్టి కూడా తీయలేదన్నారు.
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని గజ్వేల్ సభలో తీర్మానం చేస్తామన్నారు. సభకు లక్షకు తక్కువ కాకుండా జనంతో దండుకడతామని వెల్లడించారు. ప్రతి పోలింగ్ బూతు నుంచి తొమ్మిదిమందిని... కార్యకర్తలు సభకు వచ్చేట్లు చేస్తే.. దాదాపు మూడున్నర లక్షల మంది సభకు రాగలరని రేవంత్ సూచించారు. ఈ సమావేశానికి టీపీసీసీ కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్(CONGRESS PARTY) నేతలు హాజరుకావాలని కోరారు.