కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న మల్లన సాగర్ రిజ్వర్వాయర్లో ఎనిమిది గ్రామాలు మునిగిపోతున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పునరావాస, పునరోపాధి ప్యాకేజీలు అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి... ఏడున్నర లక్షల రూపాయల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం, రెండు పడక గదుల ఇల్లు ఇస్తోంది. 18సంవత్సరాల వయసు దాటి పెళ్లి కాని యువతీ యువకులకు 5లక్షల పరిహారం, 250గజాల ఇంటి స్థలం ఇస్తోంది.
ఆగమేఘాల మీద పెళ్లిలు...
తమ కుమారుడికి పెళ్లి చేస్తే.. పునరావాస, పునరోపాధిలో అదనపు ప్రయోజనం పొందవచ్చన్న ఆశతో కొంత మంది తల్లిదండ్రులు తమ కొడుకులకు ఆగమేఘాల మీద పెళ్లిలు చేస్తున్నారు. రెండు మూడు సంవత్సరాల తర్వాత చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్లు కూడా... ఎలాగు ఊరు మునిగిపోతుంది.. అంతకంటే ముందే అయిన వాళ్లందరి సమక్షంలో పెళ్లి చేయాలన్న ఆలోచనతోనూ తమ కొడుకులకు వివాహలు చేశారు.
ప్రతి వీధిలోనూ పెళ్లి ఇళ్లే...
యువకుల కంటే పెళ్లైన వారికి సుమారు ఏడున్నర లక్షల రూపాయల అదనపు ప్రయోజనం లభిస్తుండటం వల్ల 21-23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకుల్లో చాలా మందికి ఈ మధ్య కాలంలో వివాహాలు జరిగాయి. దాదాపు ప్రతి విధిలోనూ పెళ్లి ఇల్లు కనిపిస్తోంది. ప్యాకేజీని దృష్టిలో పెట్టుకుని సుమారు 100 వరకు వివాహాలు జరిగినట్లు అంచనా. అయితే కొంత మందికి మెండిచేయి ఎదురైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 లోపు వివాహం చేసుకున్న వారినే అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇటీవల పెళ్లైన వారిని కూడా కుటుంబంగా గుర్తించి పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.