ఆహ్లాద వాతావరణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలలో సీటు దొరకటమంటే అంత సులువైన విషయం కాదండోయ్. డబ్బులిస్తే, పైరవీలు చేయిస్తే.... ఏ కార్పొరేట్ స్కూల్‌లోనైనా సీటు కొనొచ్చేమోగానీ... ఈ బడిలో మాత్రం పిల్లలకు సీటు దొరకటం గగనంగా మారింది. పిల్లలను చేర్పించేందుకు ఎగబడిన జనం... పాఠశాల ముందు తగలించిన ఈ బోర్డును చూస్తేనే ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ఎంత ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. ఇది ఎక్కడో కాదు సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల.
ఆరేండ్ల క్రితం 300మంది మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో.... ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 1195కు చేరుకుంది. ఇప్పటికే అన్ని తరగతి గదుల్లో సీట్లు పూర్తిగా నిండిపోయాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్న ఈ బడిలో.... 6, 7 తరగతుల్లో 4 సెక్షన్లు, 8, 9, పదో తరగతుల్లో 5 సెక్షన్ల చొప్పున తరగతులు బోధిస్తున్నారు. మొత్తం 1195 మంది విద్యార్థులను 23 సెక్షన్లుగా విభజించి... విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగే కొద్దీ.... సెక్షన్లు పెరుగుతున్నాయి. ఆరో తరగతిలో ప్రవేశాలకు 160 సీట్లు ఉండగా...400 దరఖాస్తులకు పైగా దరఖాస్తులు ఒక్క సోమవారం రోజే వచ్చాయంటే...ఈ పాఠశాలలో ఒక్కో సీటుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 7, 8, 9, 10వ తరగతుల్లో అడ్మిషన్లు నిండిపోగా.... ఆరో తరగతిలో ప్రవేశాల కోసం రోజూ వందల మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకునేందుకు బారులు తీరుతున్నారు.
మా బాబు ప్రైమరీ స్కూల్ చదివారు. ఇక్కడ పాఠశాలలో బాగుంటుందని ఇక్కడికి చేర్పించేందుకు తీసుకొచ్చా. కానీ వారం తర్వాత రమ్మంటున్నారు. ఇక్కడ చదువు బాగా చెబుతారు. ఇప్పటికైతే సీటు గ్యారంటీ ఇవ్వడం లేదు.
- రాజు, విద్యార్థి తండ్రి
ఈ పాఠశాల 2015 నుంచి ప్రతి ఏడాది అడ్మిషన్ల కోసం పోటీ నెలకొంది. ప్రతి ఏటా సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. ఇప్పటికే వెయ్యికి పైగా విద్యార్థులు ఉన్నారు. అన్ని సెక్షన్లలో సీట్లు పూర్తయినందున అదనంగా అడ్మిషన్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. మాకు ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్య ఉంది. దీనిపై అధికారుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.