Parents and students waiting residential School in Husnabad : తరగతికి ఆలస్యంగా వస్తే పిల్లలను కాసేపు బయటం నిలబెట్టడం సహజమే.. వేసవి సెలవుల అనంతరం తల్లిదండ్రులు వారి పిల్లలను వారం రోజుల తర్వాత పాఠశాలకు ఆలస్యంగా తీసుకొచ్చారని.. స్కూల్ గేట్ తీయకపోవడంతో వారందరు ఎండలో బయటే ఉండిపోయారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల గేటు ఎదుట ఉదయం నుంచి సుమారు వందమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడిగాపులు కాయడం చర్చనీయాంశంగా మారింది.
పాఠశాలలో పంపి వెళదామని ఉదయం తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొనివచ్చారు. వారం రోజులు ఆలస్యంగా వచ్చారనే కారణంతో మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు పాఠశాలలోనికి అనుమతించడం లేదని వారు వాపోయారు. పాఠశాలలోకి రావాలంటే ఆర్సీవో దగ్గరికి వెళ్లి అనుమతి తెచ్చుకోవాలని ప్రిన్సిపాల్ మేడమ్ చెప్పారన్నారు. ఆర్సీవో దగ్గరికి వెళ్తే తీరా ఆమె లేకపోవడంతో తిరిగి పాఠశాలకు వచ్చి ఆర్సీవో మేడమ్ లేదని చెప్పిన.. పాఠశాలలోనికి రానివ్వకుండా గేటు ఎదుటే ఎండలో నిలబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఎండాకాలం సెలవుల్లోనే పాఠశాలకు ఆలస్యంగా రాకూడదని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సూచించామని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు పాఠశాలకు వారం రోజులు ఆలస్యంగా వచ్చారని.. దీంతో ఆర్సీవో మేడమ్ నుంచి అనుమతి తీసుకొని రావాలని చెప్పామన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకే తాము నడుచుకుంటున్నట్లు వెల్లడించారు. చివరకు విద్యార్థులను వారి తల్లిదండ్రులను కాంపౌండ్ వాల్లోనికి మాత్రమే అనుమతించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల మరి ఇంత కఠినంగా వ్యవహరించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.