తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 12:38 PM IST

ETV Bharat / state

ఉపాధ్యాయులకు అంతర్జాలంలో శిక్షణ.. నైపుణ్యాల పెంపునకు సదవకాశం

కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గతంతో పోల్చితే వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. దీనికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో తెలియని స్థితి నెలకొంది. ఈ తరుణంలో పాఠశాలల పునఃప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. అయితే పాఠశాల విద్యాశాఖ అంతర్జాలం వేదికగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టుల్లో తర్ఫీదు మొదలైంది. కాగా పిల్లలకు ఆన్​లైన్​ పాఠాలు ఎలా చెప్పాలి.. వారి సందేహాలను ఎలా నివృత్తి చేయాలనే అంశాలపై ఉపాధ్యాయులు పట్టు సాధిస్తున్నారు.

online training classes for teachers in siddipet district
ఉపాధ్యాయులకు అంతర్జాలంలో శిక్షణ.. నైపుణ్యాల పెంపునకు సదవకాశం

సిద్దిపేట జిల్లాలోని ఉపాధ్యాయులకు విడతల వారీగా ఆన్​లైన్​ తరగతుల శిక్షణ కార్యక్రమం చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండు సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తర్ఫీదు మొదలైంది. విద్యాసంవత్సరం పునఃప్రారంభం జూన్‌లో కావాలి. కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటికీ ఈ అంశంలో స్పష్టత రాలేదు. ఏటా ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యం పెంపునకు శిక్షణ ఇస్తుంటుంది. ఈసారి బడులు ప్రారంభం కాకపోవడం వల్ల ఆన్‌లైన్‌ విధానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అంతర్జాలం వేదికగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వల్ల వారికి కూడా ఈ అంశంపై పట్టు రానుంది. వైరస్‌ వ్యాప్తి భవిష్యతులో మరింతగా పెరిగితే బడులు తెరుచుకునే స్థితి ఉండదు. అలాంటి తరుణంలో అంతర్జాలం వేదికగా పిల్లలకు పాఠాలు బోధించే పరిస్థితి కూడా రావచ్చనే భావన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఏకకాలంలో 500 మందికి..

జిల్లాలో 6-10వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ప్రక్రియ జిల్లాలో మొదలైంది. జూమ్‌ యాప్‌ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. దాదాపు 500 మంది ఉపాధ్యాయులు ఏకకాలంలో యాప్‌ ద్వారా తర్ఫీదు పొందే ఏర్పాట్లు చేశారు. నమోదు చేసుకున్న ఉపాధ్యాయులకు ఒక రోజు ముందుగానే సెక్టోరియల్‌ అధికారి డాక్టరు రమేశ్‌... సమావేశ ఐడీ, పాస్‌వర్డ్‌ పంపుతున్నారు. జిల్లాలో గత నెల 29న గణితంలో ఈ ప్రక్రియ మొదలైంది. తర్ఫీదు 25 రోజుల పాటు కొనసాగనుంది. రేఖ, బీజ, సంఖ్యా శాస్త్రాల్లోని అంశాలను రిసోర్సు పర్సన్లు వివరిస్తున్నారు. భౌతికశాస్త్రంలో జూమ్‌ యాప్‌ ద్వారా శిక్షణకు బుధవారం అంకురార్పణ జరిగింది. 20 రోజుల పాటు కొనసాగనుంది. భౌతికశాస్త్రంలో క్లిష్టమైన అంశాలు, ప్రయోగశాల కృత్యాలు రిసోర్సు పర్సన్లు బోధించనున్నారు. ఐఐసీటీ ఆచార్యులతో గెస్ట్‌ లెక్చర్స్‌కు కూడా ప్రణాళిక రూపొందించారు. రిసోర్సు పర్సన్లు బోధిస్తున్న క్రమంలో సందేహాల నివృత్తికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. మిగిలిన సబ్జెక్టులకు కూడా అవసరాన్ని బట్టి 10-20 రోజుల పాటు శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు నిత్యం రెండు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

అన్ని సబ్జెక్టుల్లోనూ..

జిల్లాలో అంతర్జాల శిక్షణ మొదలైంది. ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా అంతర్జాల వేదికలో నమోదై నిర్దేశిత తేదీల్లో శిక్షణకు హాజరుకావాలని డీఈవో డాక్టర్​ రవికాంత్​రావు తెలిపారు. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు. నైపుణ్యాల పెంపు, అంతర్జాలంలో బోధించే సామర్థ్యం అలవర్చుకునేందుకు ఈ శిక్షణ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు

ABOUT THE AUTHOR

...view details