సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామ శివారులోని ఫీడర్ ఛానల్ కాల్వకట్ట దారిని.. పక్కనే ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ ఆక్రమించాడని రైతులు ఫిర్యాదు చేయడం వివాదానికి దారితీసింది. 'జనగామ నుంచి తోటపల్లి మీదుగా ఎల్లమ్మ చెరువుకు వెళ్లే వాగుకు మధ్యలో రూ.3కోట్లతో చెక్ డ్యామ్ నిర్మించారు. తోటపల్లి చెరువు తూము నుంచి ఫీడర్ ఛానల్ ద్వారా మాసానుకుంట, కొత్తకుంటకు నీళ్లు వెళ్లకుండా.. పక్కనే ఉన్న దుర్గా ప్రసాద్ ఫీడర్ ఛానల్‌తో పాటు పక్కనే ఉన్న దారిని ఆక్రమించాడు. ఫెన్సింగ్ వేసి మూసివేశారని' చుట్టుపక్కల రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
రైతుల ఫిర్యాదుతో ఇరిగేషన్ ఏఈ, సర్వేయర్.. రైతుల సమక్షంలో ఫీడర్ ఛానల్ కొలతలు తీసుకుంటుండగా విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దుర్గాప్రసాద్, ఆయన భార్య.. అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. చరవాణిలో వీడియో రికార్డు చేస్తూ.. మీరు ఎవరి అనుమతితో కొలతలు తీస్తున్నారని అధికారులను నిలదీస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. వెంటనే అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు.