రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న గోదావరి పథకంలోని మల్లారంలోని జలమండలి మంచి నీటి శుద్ధి కేంద్రంలోని పంపుహౌస్‌లోకి వరద నీరు చేరింది. ఇక్కడ తొమ్మిది పంపులు నీట మునిగిపోయాయి. దీంతో మంత్రి హరీశ్ రావు, జలమండలి ఎండీ దానకిశోర్‌తో కలిసి పంపు హౌస్‌ను పరిశీలించి పునరుద్ధరణ పనులను సమీక్షించారు. సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు పంపుహౌస్‌లోకి వరద చేరడంతో ముందస్తు జాగ్రత్తగా పంపింగ్ ప్రక్రియను నిలిపివేసినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. పంపుహౌస్ నుంచి నీటిని తోడి పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు చెప్పారు. దీనివల్ల సిద్దిపేట, మేడ్చల్, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా అంతరాయం ఏర్పడిందని, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పునరుద్ధరణ పనుల అనంతరం యథావిధిగా పంపింగ్ మొదలవుతుందని జలమండలి ఎండీ దానకిషోర్ వెల్లడించారు.
MALLARAM PUMP HOUSE: మల్లారం పంపుహౌస్‌లోకి వరద నీరు.. నీటి సరఫరాకు అంతరాయం - telangana varthalu
సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాల ధాటికి గోదావరి ప్రాజెక్టులో భాగమైన చిన్న కోడూరు మండల పరిధి మల్లారం పంపుహౌస్‌లోకి వరద నీరు చేరింది. తొమ్మిది పంపులు నీట మునిగిపోయాయి. పంపు హౌస్‌ను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు.. పునరుద్ధరణ పనులను సమీక్షించారు. దీనివల్ల సిద్దిపేట, మేడ్చల్, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా అంతరాయం ఏర్పడిందని మంత్రి చెప్పారు.
పునరుద్ధరణ పనులు పూర్తి చేసి తిరిగి పంపింగ్ చేయడానికి మరో 36 నుంచి 48 గంటలు పడుతుందని, మంచినీటి సరఫరా ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరి పథకం ద్వారా సరఫరా జరిగే ప్రాంతాల్లో ముఖ్యంగా నగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సైనిక్‌పురి, మల్కాజిగిరి, పటాన్ చెరు, నిజాంపేట్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. ఈ ప్రాంతాలకు సింగూరు, మంజీరా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి అదనంగా నీటిని తరలించి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పల్లెచెరువు నుండి వచ్చే వరద నీటిని నిరోధించడానికి ప్రహరీ గోడను నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: HARISH RAO: 'హుజూరాబాద్ ప్రజలంతా మావైపే'