తెలంగాణ

telangana

ETV Bharat / state

NGT: గౌరవెల్లి రిజర్వాయర్‌ పరిశీలనకు కమిటీ

సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి రిజర్వాయర్​ సామర్థ్యం పెంపు పనులను సవాలు చేస్తూ ఎన్జీటీలో పిటిషన్​ దాఖలైంది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా గౌరవెల్లి సామర్థ్యం పెంపు పనులు సాగుతున్నాయని పిటిషనర్​ తరఫున వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం పనుల పరిశీలనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్​ 30లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

By

Published : Aug 15, 2021, 12:10 PM IST

gouravelli reservoir
గౌరవెల్లి రిజర్వాయర్‌

సిద్దిపేట జిల్లాలో పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు పనుల పరిశీలనకు చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) తాజాగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. చెన్నై లేదా హైదరాబాద్‌లోని కేంద్ర పర్యావరణ ప్రాంతీయ శాఖ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలవనరుల సంఘానికి చెందిన సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెప్టెంబరు 30లోగా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై మధ్యంతర నివేదిక ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలిపింది.

పిటిషనర్​ తరఫు వాదనలు

ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా గౌరవెల్లి రిజర్వాయరు సామర్థ్యాన్ని పెంచుతూ పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ గౌరవెల్లికి చెందిన బి.రాజిరెడ్డి, మరో నలుగురు ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జ్యుడీషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 2003లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ స్టేజ్‌-2 కాకతీయ కాలువ విస్తరణకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. దీని ద్వారా అదనంగా 1.781 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాలన్నది లక్ష్యమని వెల్లడించారు.

2017లో రాష్ట్ర విభజన తర్వాత ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టు పేరుతో గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.410 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని శ్రవణ్​ కుమార్​ అన్నారు. ఇందులో భాగంగా తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి గౌరవెల్లి రిజర్వాయర్‌కు లిఫ్ట్‌ ద్వారా నీటిని చేర్చడానికి టన్నెల్‌ వంటి వాటిపై అధ్యయనం చేయాలని ఆదేశించిందని పేర్కొన్నారు. రిజర్వాయర్‌, కాలువల నిర్మాణాలకు అవసరమయ్యే భూమి సేకరణకు కరీంనగర్‌, సిద్దిపేట కలెక్టర్లు నోటిఫికేషన్‌లు జారీ చేశారని స్పష్టం చేశారు. అయితే.. ప్రభుత్వం సామాజిక ప్రభావాన్ని అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టు పనులు చేపడుతోందని, దీని వల్ల ముంపు ప్రాంతం ఎక్కువవడంతో పాటు వ్యవసాయం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.

సెప్టెంబర్​ 30కి వాయిదా

వాదనలు విన్న ధర్మాసనం రిజర్వాయర్‌ పనుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులైన కేంద్ర పర్యావరణ, హోం శాఖ, రాష్ట్ర నీటిపారుదల శాఖ, కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, సిద్దిపేట కలెక్టర్‌, ఈఎన్‌సీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:డీపీఆర్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ పని: కృష్ణా బోర్డు

ABOUT THE AUTHOR

...view details