ఆరోగ్యం, ఆహ్లాదం కోసం సిద్దిపేట పట్టణ అభివృద్ధి సంస్థ(సుడా) ఆధ్వర్యంలో ప్రకృతి వనాలు, అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామంలో పార్కులను జడ్పీ ఛైర్పర్సన్ రోజాశర్మతో హరీశ్‌రావు ప్రారంభించారు.
సుడా ఆధ్వర్యంలో రంగనాయక సాగర్ ఆవరణలలో రూ.52.58 లక్షల వ్యయంతో.. 3.15 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. 5 లక్షల మొక్కల సామర్థ్యంతో 46 రకాల మొక్కలు ఉంచినట్లు తెలిపారు. రంగనాయక సాగర్ ఆవరణలోనే రూ.9.30 లక్షలతో ట్రీ పార్క్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 1.25 ఎకరాల ట్రీ పార్కులో 70 రకాల.. 9,800 మొక్కలను ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో సుడా ఛైర్మన్ రవీందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.