సిద్దిపేట జిల్లా ముట్రాజ్‌పల్లికి చెందిన రైతు అయోధ్యకు 75 ఏళ్ల వయసున్న తండ్రి ఉన్నారు. భార్య పద్మ పేరు మీద 4.16 ఎకరాల భూమి ఉంది. ముట్రాజ్‌పల్లి శివారులో పునరావాస కాలనీ నిర్మాణ పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఇందుకోసం అయిదుగురు రైతులకు చెందిన 9.31 ఎకరాల్లోని పంటను ఆదివారం తొలగించారు. అడ్డుకోబోయిన రైతులను పోలీసులు ఠాణాకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేశారు. తన పొలంలోని వరి పంటను ధ్వంసం చేయడంతో అయోధ్య ఆందోళనకు గురయ్యారు. తన అయిదుగురు కుమార్తెలు, భార్యతో కలసి వీడియోలో మాట్లాడుతూ తమకు చావు తప్ప మరో దారి లేదని కంటతడి పెట్టారు. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు బలవంతంగా భూమి లాక్కుంటున్నారని రైతు ఆవేదన - Farmer consciousness for land in mutrajpally
‘భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న. నాకు అయిదుగురు ఆడపిల్లలు. ఇంకా ముగ్గురి పెళ్లిళ్లు చెయ్యాలె. నాలుగు ఎకరాల్లో వరి వేసిన. నాలుగు లక్షల రూపాయల అప్పుంది. మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం ఇళ్లు నిర్మించేందుకు అధికారులు బలవంతంగా భూమిని తీసుకుంటున్నరు. పొలంల పంటను తొక్కించిండ్రు. భూమి లేకపోతే మేం ఎట్ల బతకాలే. మా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం. మాకేం జరిగినా అధికారులు, ప్రభుత్వానిదే బాధ్యత’ అంటూ సిద్దిపేట జిల్లా ముట్రాజ్‌పల్లికి చెందిన అయోధ్య అనే రైతు ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
నిబంధనల ప్రకారం పరిహారం డిపాజిట్ చేశాం..
ఈ విషయమై ఆర్డీవో విజయేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. పునరావాస కాలనీ కోసం భూమి ఇవ్వాలని మర్కంటి అయోధ్యను పలుమార్లు అడిగామన్నారు. నోటీసులకు స్పందించకపోవడంతో అవార్డు పాస్ చేసి రూ.54,75,928 పరిహారాన్ని ఆర్‌అండ్‌ఆర్ అథారిటీలో శనివారం డిపాజిట్ చేశామని పేర్కొన్నారు. మొత్తం అయిదుగురు భూయజమానులకు సంబంధించి రూ.1,21,45,993 అథారిటీకి అప్పచెప్పామన్నారు. వారి భూమి, వాటిలోని బోరు, చెట్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన విలువ కూడా జోడించామని వివరించారు.