ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్లోని వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు నర్సింలు కుటుంబానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆ మొత్తాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబానికి అందజేశారు. ఎంపీ కోమటిరెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో నర్సింలు పురుగుల మందు తాగి మరణించడం అత్యంత బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, వారికి మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి.. ఇప్పటికే తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. భూమిని అన్యాయంగా లాక్కొని నర్సింలు ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందని మండిపడ్డారు.