సీఎం కేసీఆర్ నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలో తెరాసను ఓడిస్తేనే ప్రజలకు ఆయన అందుబాటులోకి వస్తారని వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి.. పలు వార్డుల్లో జెండా ఆవిష్కరణ, భాజపా కార్యాలయం ప్రారంభంలో పాల్గొన్నారు.
విశ్వగురువుగా..
తెలంగాణ రాజకీయాలను దుబ్బాక ఉపఎన్నిక మలుపు తిప్పిందని రఘునందన్ రావు అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టి భారత్ విశ్వగురువుగా నిలిచిందని కొనియాడారు.
రామరాజ్యంగా..
కరోనా వచ్చి మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించిందని తెలిపారు. సిద్దిపేట ప్రజలూ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. రెండేళ్ల తర్వాత రామరాజ్యంగా మారబోతుందని జోస్యం చెప్పారు. పట్టణం ఊరు బయట పచ్చగా, లోపల గుంతల మయంగా ఉందని విమర్శించారు.
కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలపై ఇక్కడి నుంచే పోరాటం మొదలు పెట్టాలి. ప్రలోభాలకు లొంగకుండా భాజపాకు మద్దతివ్వాలి. నాయకులు, కార్యకర్తలు అమ్ముడు పోకుండా దేనినైనా ఎదుర్కొనే శక్తి తమకు మాత్రమే ఉంది. రామమందిర నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి.
-రఘునందన్ రావు, ఎమ్మెల్యే
ఇదీ చూడండి:తెరాసకు మేమే ప్రత్యామ్నాయం : మంద కృష్ణ మాదిగ