mission bhagiratha trial runs started in mangole: సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ జలాశయం నుంచి మిషన్ భగీరథకు నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదల ట్రయల్‌ను మంత్రి హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలోని మంగోల్‌లో మిషన్ భగీరథ ప్లాంట్‌ను నిర్మించారు. రూ.1,212 కోట్లతో నిర్మించిన ఈ నీటి శుద్ధీకరణ కేంద్రం నేడు ప్రారంభం అయ్యింది.
540 మిలియన్ లీటర్ల సామర్థ్యం:మిషన్ భగీరథకు భవిష్యత్తులో ఎలాంటి అవారోధాలు ఏర్పడొద్దు అనే లక్ష్యంతో ప్రభుత్వం సిద్దిపేటలో నిర్మించిన భారీ నీటిశుద్ధి కేంద్రం నేడు అందుబాటులోకి వచ్చింది. మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ దీనిని ప్రారంభించారు. మల్లన్న సాగర్‌కు అనుబంధంగా దీనిని నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడం వల్ల వివిధ జిల్లాల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. మల్లన్నసాగర్ జలాశయం నుంచి నీటిని తీసుకుని వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో 1,212 కోట్ల రూపాయలతో నీటిశుద్ధి కేంద్రం ప్రారంభించింది. కొండపాక మండలం తిప్పారం వద్ద మల్లన్న సాగర్ జలాశయంలో మిషన్ భగీరథ కోసం నీటిశుద్ధి కోసం ఇంటేక్వెల్ నిర్మించారు. ఇక్కడ నుంచి 5 కిమీల దూరంలో మంగోల్ గ్రామం వద్ద 540 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించారు.
భారత్‌లోనే అతిపెద్దది: మంగోల్ ప్లాంట్ నుంచి సిద్దిపేట, మెదక్ , మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, జనగాం, సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాలకు ఈ తాగునీటిని పంపిస్తారు. వచ్చే ఐదు శతాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మల్లన్న సాగర్ వద్ద ఈ నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్దది కావడమే కాక భారతదేశంలోనే అతిపెద్దది. దీని ద్వారా 7జిల్లాల్లోని 10 7నియోజక వర్గాలకు ప్రయోజనం కలుగనుంది. 1922 ఆవాసాలకు తాగునీరు అందనుంది. ఇందుకోసం మల్లన్న సాగర్‌లో 30టీఎంసీల నీటిని ఇందుకోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 110 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను ప్రత్యేకంగా నిర్మించారు.