తెలంగాణ

telangana

ETV Bharat / state

Harishrao Comments: 'కేంద్ర మంత్రులు దిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో తిడతారు' - వెటర్నరీ వర్సిటీ నిర్మాణానికి హరీశ్ శంకుస్థాపన

Harishrao Latest Comments: కేంద్రమంత్రులు దిల్లీలో మెచ్చుకుంటారు, గల్లీలో తిడతారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు పీవీ ఘాట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదన్న మంత్రి ... వెటర్నరీ వర్సిటీకి పీవీ పేరు పెట్టి ఆయన గౌరవాన్ని మరింత పెంచింది కేసీఆర్ అని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావుతో కలిసి పర్యటించిన తలసాని.. ఈ నెల చివరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.

Harishrao
Harishrao

By

Published : May 7, 2023, 1:26 PM IST

Harishrao Latest Comments: సిద్దిపేట జిల్లాలో ఇవాళ రాష్ట్ర మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. సిద్దిపేట పట్టణంలో నిర్మించనున్న పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూఖ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెటర్నరీ వర్సిటీకి పీవీ పేరు పెట్టి ఆయన గౌరవాన్ని పెంచాం: పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం మాట్లాడిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్రమంత్రులు దిల్లీలో మెచ్చుకుంటారు, గల్లీలో తిడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు పీవీ ఘాట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదన్న మంత్రి హరీశ్​రావు... వెటర్నరీ వర్సిటీకి పీవీ పేరు పెట్టి ఆయన గౌరవాన్ని మరింత పెంచింది కేసీఆర్ అని పేర్కొన్నారు. కాళోజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లతో వర్సిటీలు నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

రెండో విడతలో 3.70 లక్షల మందికి గొర్రెల పంపిణీ : మత్స్యకార సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులు ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మరో లక్ష మందికి సభ్యత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల చివరిలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు తలసాని చెప్పారు. రెండో విడతలో 3.70 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని స్పష్టం చేశారు.

అంతకుముందు సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హనుమాన్ దీక్ష మాలధారణ స్వాముల భజన, స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు పాల్గొని స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. అలాగే శనివారం సిద్దిపేట పట్టణంలో హనుమాన్ తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిని హరీశ్​రావు.. సిద్ధిపేటలో 30ఏళ్ల క్రితం కేవలం ఐదుగురితో ప్రారంభమైన హనుమాన్ దీక్ష నేడు వేలాదిమందికి చేరడం శుభపరిణామం అన్నారు. సిద్దిపేట ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక సేవలకు పుణితం అయిన పుణ్య గడ్డ.... అలాంటి పట్టణంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కోమటి చెరువు వద్ద అఖిల భారత హనుమత్ దీక్షా పీఠం పీఠాధిపతి, హనుమాన్ దీక్ష మాల రూపకర్త శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామి వారితో కలిసి తెప్పోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వచ్చే ఏడాది రంగనాయక సాగర్​లో తెప్పోత్సవం జరుపుకుందామని హరీశ్​రావు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details