Minister KTR Speech at Dubbaka Corner Meeting : రాష్ట్రంలో డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములు కలిగిన రైతులకు హక్కులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి 11 సార్లు ఛాన్స్ ఇస్తే.. 55 ఏళ్లు రాష్ట్రాన్ని చావగొట్టారని దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి.. కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ 11 సార్లు అధికారంలో ఉన్నా ఏం అభివృద్ధి చేసింది : కేటీఆర్
KTR Election Campaign in dubbaka : ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి ఎద్దు తెలియదు - వ్యవసాయం తెలియదని కేటీఆర్ మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నారని.. ధరణి తీసేసి పట్వారీ వ్యవస్థ తెస్తామని భట్టి విక్రమార్క చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల వ్యవహారం కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉంటదని ఎద్దేవా చేసారు. ఈ క్రమంలోనే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. తట్టెడు మట్టి కూడా వేసి అభివృద్ధి చేయలేని ఆయనకు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు.
యాదగిరిగుట్ట గురించి యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారు: కేటీఆర్
ఈ ఎన్నికల్లో పొరపాటు చేస్తే 50 ఏళ్లు వెనక్కి పోతామని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్లు మళ్లీ 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తారని.. చీకటి రోజులు తెస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 3 తర్వాత 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడ బిడ్డకు సౌభాగ్య లక్ష్మి కింద నెలకు రూ.3000 ఇస్తామని కేటీఆర్ తెలిపారు. దశల వారీగా ఆసరా పింఛన్ రూ.5 వేలకు పెంచుతామన్నారు. జనవరి నెల నుంచి కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్‌లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇవన్నీ జరగాలంటే అందరం ఒక్కటై.. దిల్లీ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.