సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రూ.10 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (venkateshwara temple)లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. అనంతరం మూడు రోజుల పాటు ఆలయంలో పాలాభిషేకం, కనకాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. నాలుగో రోజైన నేడు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై.. పూజల్లో పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో.. దుబ్బాకలోని వెంకటేశ్వర ఆలయం సైతం అదేవిధంగా భక్తి పారవశ్యంతో కనిపిస్తుందని మంత్రి హరీశ్‌రావు, చినజీయర్ స్వామిలు పేర్కొన్నారు. దేవుడు అందరికీ ఒక్కడే అని అన్నారు. దేవాలయాల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా భావించింది ఒక్క తెరాస సర్కారు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆలయాన్ని అన్ని రకాలుగా అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పంట పొలాలతో పచ్చగా కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరవు కాటకాలే దర్శనమిచ్చేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆలయాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. గత ప్రభుత్వాలు ఆలయాలకు కేటాయించిన నిధులను వేరే విధంగా మళ్లించే వారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని హర్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దేవాలయాల నిధులను గతంలో ప్రభుత్వాలు వాడుకునేవి. ప్రజల అవసరాలకు ఖర్చు చేసేవి. కానీ సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక.. దేవాలయాల కోసం పెద్దఎత్తున నిధులు ఖర్చు పెట్టారు. అందుకే కేసీఆర్‌కు ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ధాన్యాగారంగా మారింది. అనేక రకాలుగా అభివృద్ధిలో ఈ రాష్ట్రం ముందుకుపోతుంది. - హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి