మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన చార్‌ధామ్ దర్శినిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రెండో రోజు ఉత్సవాలను మధుసూదనానంద స్వామి ఆరంభించి అనుగ్రహ భాషణం చేశారు.
చార్‌ధామ్‌ను దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చార్‌ధామ్ దర్శిని భక్తులకు నయనానందాన్ని కలిగించింది. శివనామస్మరణతో ఆధ్యాత్మికతను పంచింది. వేల సంఖ్యలో తరలివచ్చిన జనంతో ప్రాంగణం కళకళలాడింది. మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చార్‌ధామ్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చార్‌ధామ్ నమూనాను దర్శించుకునేందుకు వేకువజామునుంచే పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. యమునోత్రి, గంగ్రోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ ఆలయాల ఆకృతుల్లో కొలువైన దేవతామూర్తులను దర్శించుకుని పరవశించిపోయారు. ఈ వేడుకలో భాగంగా శివానంద లహరి పేరిట చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, తదితర నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి:యాదాద్రిలో అధునాతన విద్యుత్తు వెలుగులు..