చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసే క్రమంలో సీఎం హామీ మేరకు మూడు గ్రామాలు కలుపుకుని 1580 యూనిట్లు ఉండగా, ఇవాళ చింతమడకలో 133 మందితో కలిపి 1270 మందికి లబ్ధి చేకూర్చినట్లు మంత్రి వెల్లడించారు.
గ్రామంలో రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం నీళ్లుతో ప్రతి రైతుకు ఏటా రెండు పంటలు పండించుకునే వీలుందన్నారు. త్వరలో పాడి పశువులను పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం సూచనలు స్వీకరించి రైతులు నియంత్రిత సాగుకు ముందుకు వచ్చి పంటల సాగులో మార్పులు తెచ్చారని రైతులను అభినందించారు. ప్రతి గ్రామంలో రైతులు 60 శాతం సన్న రకం వరి సాగు చేయాలని మంత్రి కోరారు.
భూ స్థలాలు కొనుగోలు చేసేందుకుగాను 133 మందికి రూ.9 కోట్ల 87 వేల రూపాయల విలువ కలిగిన చెక్కులను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. భూమి కొంటే పది కాలాలు మీకే ఉంటుందని, ఎవరూ భూములు అమ్ముకోవద్దని గ్రామస్తులను కోరారు. గ్రామాల్లో ఇళ్లు తొలగించని వారు కూడా ఇళ్లు తొలగించి స్థలాలను ఇస్తే.. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.