సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్, విఠలాపూర్ గ్రామాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ముందుగా గంగాపూర్‌లో పర్యటించిన మంత్రి.. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయిందా అని అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
అనంతరం మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు. లాక్డౌన్ కారణంగా రేషన్ కార్డుదారులకు అందిస్తున్న రూ.1500 అందాయా అని ఆరా తీశారు. ఈసారి వరి పంటలు కాకుండా.. మిరప, ఇతర కూరగాయల పంటలు పండించి లాభాలు పొందాలని వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎరువుల కోసం ఏ రైతూ చిన్నకోడూర్, సిద్దిపేటకు రావొద్దని.. ఎక్కడివక్కడే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.