తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish rao: వరిసాగులో వెదసాగు పద్ధతిని ప్రోత్సహించాలి - telangana varthalu

వరిసాగులో రైతులు మూస పద్ధతికి స్వస్తి చెప్పి ప్రత్యక్ష సాగు వైపు నడవాలని మంత్రి హరీశ్​రావు రైతులకు సూచించారు. వెదజల్లే విధానంలో వరిసాగు చేసి లాభాలు సాధించాలని రైతులకు సూచించారు. సిద్దిపేట జిల్లా పెద్దలింగారెడ్డిపల్లిలోని ఎల్లారెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి హరీశ్​ సందర్శించారు.

Harish rao: వరిసాగులో వెదసాగు పద్ధతిని రైతులు ప్రోత్సహించాలి
Harish rao: వరిసాగులో వెదసాగు పద్ధతిని రైతులు ప్రోత్సహించాలి

By

Published : Jun 1, 2021, 6:12 PM IST

వరిసాగులో వెదజల్లే సాగు పద్ధతిని ప్రోత్సహించాలని రైతులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు సూచించారు. రైతులు మూస పద్ధతికి స్వస్తి చెప్పి ప్రత్యక్ష సాగు వైపు నడవాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతును లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్​ మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లిలోని ఎల్లారెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి హరీశ్​ సందర్శించారు. వెదజల్లే సాగు పద్ధతితో లాభాల బాట పట్టిన రైతులు ఎల్లారెడ్డి, వెంకట్​ రెడ్డి, మహేంద్రా రెడ్డిలను మంత్రి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా వెద సాగుకు సంబంధించిన అంశాల గురించి రైతులతో మంత్రి చర్చించారు. సాధారణ సాగుకు, వెదసాగుకు మధ్య భేధాలు, సాగుకు పెట్టే ఖర్చుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వెదసాగు గురించి రైతులు తమ అనుభవాలను వివరించారు.

వెదసాగు వల్ల లాభాలు

వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తే వచ్చే లాభాలను మంత్రి రైతులకు వివరించారు. ఈ విధానం ద్వారా నారు పోయడం, పీకడం, నాటేసే పనులు ఉండవన్నారు. మామూలు పద్ధతిలో ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలని... కానీ ఈ పద్ధతిలో 8కిలోల విత్తనాలు సరిపోతాయన్నారు. నీటి వినియోగం 30 నుంచి 35 శాతం తగ్గుతుందన్నారు. 10-15 రోజుల ముందే పంట చేతికొస్తుందని మంత్రి హరీశ్​ రావు రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి 42 క్వింటాళ్లు దిగుబడి పొందారని తెలిపారు.

20 వేల ఎకరాలు లక్ష్యంగా..

వానాకాలంలో సిద్దిపేట నియోజకవర్గంలో 20 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుని సత్ఫలితాలను సాధించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వెదజల్లే పద్ధతిలో రాష్ట్రంలో నెంబర్​ వన్​గా ఉండాలని... ఈ విధానంలో సాగుచేసే రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: gangula kamalakar: పేదలకు 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం

ABOUT THE AUTHOR

...view details