Minister Harish Rao Speech on Gurukul Schools : కాంగ్రెస్ నాయకులకు.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండానే మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ పార్టీపై(Congress Party) తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Minister Harish Rao Comments on Congress : కాంగ్రెస్ పార్టీది అవగాహన లేని మేనిఫెస్టో అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోకాలిచిప్ప ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని పేర్కొన్నారన్న హరీశ్‌రావు.. బీఆర్ఎస్ హయాంలో ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో ఉచితంగా నిర్వహించి విజయవంతం చేసినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ రెండవసారి సీఎం అయ్యాక విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో 60 ఏళ్లలో 268 గురుకులాల ఉంటే.. నేడు గురుకులాలను వెయ్యికి పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే(CM KCR) దక్కిందన్నారు.
వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే - గుండెపోటు గ్యారెంటీ : హరీశ్‌రావు
గతంలో గురుకులాలలో 1.90లక్షల మంది విద్యార్థులు చదివితే బీఆర్ఎస్ వచ్చాక అమాంతం 6లక్షలకు విద్యార్థులు పెరిగారన్నారు. గురుకులలో చదివిన 6652 మంది విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారనీ కొనియాడారు. రాష్ట్రంలో అగ్రవర్ణ పేద విద్యార్థుల(Upper Caste Poor Students) కోసం 119నియోజక వర్గాలలో గురుకులాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ చేతిలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనీ పేర్కొన్నారు.
అగ్రవర్ణ పేదల పిల్లలు కూడా గురుకుల పాఠశాలలో చదివించుకోవాలని.. మాకు గురుకులాలు కావాలని వారి నుంచి డిమాండ్ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు వారిగా ఎలా అయితే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారో.. అదేవిధంగా మాకు కావాలన్నారు. ఎప్పుడొస్తాది ఈ డిమాండ్.. స్కీం మంచిగా ఉంటే, నాణ్యత ఉండి పిల్లలు అభివృద్ధి చెందుతున్నారంటేనే వస్తాది. అందుకే దీనిపై ఆలోచన చేసిన కేసీఆర్ మేనిఫెస్టోలో పొందిపరిచారు. ఈ దఫా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 119 నియోజకవర్గాల్లోనూ ఓసీ గురుకులాలు ఏర్పాటుచేస్తాం.-హరీశ్‌రావు, రాష్ట్ర మంత్రి