రాష్ట్ర ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజల మేలు కోసమే పట్టణ ప్రగతి చేపట్టినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. స్వచ్ఛ సిద్దిపేట... శుద్ధిపేటగా కావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. పట్టణంలోని 6వ వార్డు గ్రీన్ లాండ్ కాలనీలో పర్యటించిన మంత్రి... వార్డు అభివృద్ధిలో భాగంగా రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
"గతంలో మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులతో చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడొద్దని.. ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు చేపట్టింది. పట్టణంలో నాలుగు దిక్కులా 5 ఫీట్ల మేర సెట్ బ్యాక్ నిబంధనలు పాటించి భవన నిర్మాణాలు జరిగేలా చూడాలి. చెట్లు కాపాడుతూ.. 6వ వార్డు గ్రీన్ లాండ్ కాలనీ ఆదర్శంగా నిలుస్తోంది."
-హరీశ్ రావు, ఆర్థికశాఖ మంత్రి
ఇంటింటా అవగాహన
పట్టణంలో మూడో విడత పట్టణ ప్రగతితో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా నాల్గో రోజు మున్సిపల్ ఛైర్మన్ మంజుల-రాజనర్సు, కమిషనర్ రమణాచారి, మున్సిపల్ అధికార యంత్రాంగం, ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లు ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా పర్యటించారు. వార్డుల్లో అభివృద్ధి పనులను పరిశీలిస్తూ... పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం ఇంటింటికీ 6 మొక్కలను మంత్రి అందజేశారు.