మొదటి విడతలో 200 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. అన్నదాతలను ప్రోత్సహించేలా ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టాలని, వాటికి తాను హాజరవుతానని తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో 27 అంశాలపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై చర్చించారు.
విత్తనోత్పత్తి- విత్తన సాగు, సెరీ కల్చర్, జనుము, జీలుగు, పచ్చిరొట్ట విత్తనాల పట్ల రైతులను చైతన్యవంతం చేయాలని సూచించారు. వరిని సంప్రదాయ రీతిలో కాకుండా వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని, ఫలితంగా పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువగా వస్తుందని తెలిపారు. వెదజల్లే పద్ధతిలో సాగు చేయడంపై రైతులు ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని ఏఈవోలను మంత్రి ఆదేశించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉన్న బియ్యం చెడి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డీఎస్ సీడీవో లత, ఎస్సీ కార్పొరేషన్ ఇంఛార్జి ఈడీ రామాచారిలను మంత్రి ఆదేశించారు.