రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికాలను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేటలోని ఐడీవోసీ(IDOC) మీటింగ్ హాల్‌లో ఆర్డీవోలు, జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లతో.. మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒక లక్షా 22 వేల 989 హెక్టార్లలో వరి సాగు చేయగా... గతంలో ఎన్నడూ లేనివిధంగా 7 లక్షల 62 వేల 533 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని మంత్రి తెలిపారు.
ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 225, ప్యాక్స్ ఆధ్వర్యంలో 156, ఏఎంసీ ఆధ్వర్యంలో 10, మెప్మా ఆధ్వర్యంలో 5.. కలిపి మొత్తం 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,960, కామన్ రకానికి రూ.1,940 కనీస మద్దతు ధరగా అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు ఇప్పటికే మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ యజమానులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని మంత్రి తెలిపారు.
కొనుగోలు కేంద్రాలకు రాబోవు రోజుల్లో ధాన్యం పెద్ద స్థాయిలో రానుందని మంత్రి సూచించారు. వరి ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రానికి పంపినట్లయితే కొనుగోళ్లు త్వరగా జరగడమే కాకుండా రైతులకు ధాన్యం కోత ఉండదన్నారు. ఆ దిశగా రైతులకు అధికారులు చైతన్యం కల్పించాలని సూచించారు. గన్నీబ్యాగుల కొరత, రవాణా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.