Harishrao on Central: వడ్ల కొనుగోళ్లు ఆలస్యం చేయాలనే కుట్రతోనే మిల్లులపై కేంద్రం దాడులు చేయిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేశాకే ఎఫ్సీఐ తనిఖీలు చేపట్టాలని తెలిపారు. సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడారు.
దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉన్నా కూడా.. తెలంగాణ వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం తొండాట ఆడుతోందని హరీశ్ రావు విమర్శించారు. బాయిల్డ్ రైస్ కొనమని కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 వేల కోట్ల భారం పడుతున్నా రైతులను కాపాడాలని నిర్ణయించారు. రాష్ట్రంపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వం 2900 రైస్ మిల్లులపై దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రైతులు నష్టపోవాలి. వడ్లు కొనవద్దు అన్న కారణంతో ఎఫ్సీఐ అధికారులతో దాడులు చేయిస్తోంది. మిల్లు యాజమాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకుని సీజ్ చేస్తున్నరు. లారీలలో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థితి లేదు. మేం తనిఖీలు చేయవద్దని అనడం లేదు. ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుగోలు పూర్తవుద్ది. వడ్లు కొనుగోలు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తది. రైతుల వడ్లు కొనవద్దని చూస్తున్నరు. కుట్రతో కేంద్రం వ్యవహరిస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు సోదరులు దీన్ని గమనించాలి. 2990 మిల్లులపై దాడులు చేస్తరా? ఇప్పుడు చేయడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. వడ్లు కొనమని తొండాట ఆడారు. కొనకపోతే తెలంగాణకు చెడ్డపేరు రావాలనేది కేంద్రం లక్ష్యం.
-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి