Harish Rao: మన వడ్లు కేంద్రం కొనాలంటే రైతులు, కార్యకర్తలు ఇళ్లపై నల్లజెండాలు ఎగరేయాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల యాసంగి ధాన్యం కొనేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. గత ప్రభుత్వాలు వడ్లు కొంటే.. మీరేందుకు తీసుకోరని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మోదీ హయాంలో అచ్చే దిన్ కాదు సచ్చే దిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. కేంద్రానికి ప్రజల నుంచి లాక్కోవడమే తప్ప ఇవ్వడం తెలియదని మండిపడ్డారు. మన్ కీ బాత్ కాదు.. ముందుగా మా రైతుల బాధలు వినాలన్నారు. రైతుల వడ్లు కొనే బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు.
ప్రతి ఇంటిమీద రేపు నల్లజెండా ఎగరేయాలి. మన వడ్లు కొనేంత వరకు నల్లజెండా ఎగురుతూనే ఉండాలే. మన వడ్లను కొనేందుకు కేంద్ర దిగిరావాలే. ప్రతి రైతు, కార్యకర్తలు నిరసన తెలపాల్సిందే. కేంద్రం ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసేలా దిల్లీలో కూడా నిరసన చేయనున్నాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పోరాటం చేస్తున్నాం. మనం చేసే నిరసనలతో కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరగాలే. రేపు జెండా ఎగరేసి ఈనెల 11న దిల్లీలో పెద్దఎత్తున నిరసన చేద్దాం.