రైతుకు ఆదాయం పెరిగేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధిక వర్షాలకు ఇళ్లు కోల్పోయిన 154 మందికి ఒక్కొక్కరికి రూ.3200 చొప్పున చెక్కులు, 220 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 502 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
రెవెన్యూ శాఖలో ఇబ్బందులు ఉండకూడదని సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఈ చట్టంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగానే రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతుకు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నామని గుర్తు చేశారు.
సీడ్ విలేజ్‌గా మార్చేందుకు కృషి..
ఈ వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయని.. యాసంగి పంటకు నీరు సమృద్ధిగా అందుతుందని మంత్రి తెలిపారు. వారం రోజుల్లోగా నియోజకవర్గంలోని ఏ గ్రామమైనా ముందుకొస్తే సీడ్ విలేజ్‌గా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. సిద్దిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. విత్తనోత్పత్తి వల్ల అధిక లాభాలున్నాయని వివరించారు.
ఆయిల్ ఫామ్ తోటలకు అనుమతి..
జిల్లాలో పామాయిల్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల 48 వేల ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలకు దిల్లీ నుంచి ఆమోదం వచ్చినట్లు మంత్రి తెలిపారు. పామాయిల్ ఉత్పత్తి చేసే యూనిట్ల కోసం 19 మంది ముందుకొచ్చినట్లు వివరించారు. సిద్దిపేట జిల్లాలో పామాయిల్, కీరదోస, విత్తనోత్పత్తి లక్ష్యంగా ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. తెరాస శ్రేణులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్