తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాం: హరీశ్‌ రావు - సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు

అమరుల త్యాగాలు, ప్రజల పోరాటం ఫలితంగా తెలంగాణను సాధించుకున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాష్ట్ర సాధన కోసం పదవులతో పాటు సీఎం కేసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

harish rao siddipet
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

By

Published : Jun 2, 2021, 3:26 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ఏడేళ్లలోనే అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. అమరవీరుల త్యాగాలు, ప్రజల పోరాటంతోనే రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

నాలుగు దశాబ్దాల కల నెరవేరింది:

నాలుగు దశాబ్దాల నాటి కల అయిన సిద్దిపేట జిల్లా ఏర్పాటును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నెరవేర్చుకున్నామని తెవిపారు. తెలంగాణ ఉద్యమానికి నాడు దిక్సూచిలా ఉన్న సిద్దిపేట అభివృద్ధికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు. గతంలో గుక్కెడు నీళ్లు కోసం తపించిన జిల్లా ప్రజలు నేడు పసిడి పంటలు, వాగులు, వంకలు గోదావరి జలాలతో జలకళను సంతరించుకుందని అన్నారు. జూన్ రెండో వారంలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేయనున్నట్లు వెల్లడించారు.

మల్లన్న సాగర్ జలాశయం ఫలాలు అందేలా చూస్తున్నామని... జిల్లాలో పంట కాలువలు నిర్మాణాలకు రైతులు సహకరించాలని కోరారు. గోదావరి జిల్లాలను తలదన్నేలా సిద్దిపేట జిల్లా ఆవిర్భవిస్తుందన్నారు. రైతులకు వెన్ను దన్నుగా ఉండేందుకు రైతు బంధు, రైతు బీమాను అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో జలాశయాల నిర్మాణంతో ఆయిల్ ఫామ్ సాగుకు అనువుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 5 న జిల్లాలో 50 వేల ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. సిద్దిపేటను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి, జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Formation Day: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు..

ABOUT THE AUTHOR

...view details