ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలోని మదీనా ఫంక్షన్హాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు. విందులో పాల్గొన్న మంత్రి సహపంక్తి భోజనాలు చేశారు.
రాష్ట్రంలోని ముస్లింలను సీఎం కేసీఆర్ గౌరవంగా నిలబెట్టారని మంత్రి తెలిపారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. అందరి సహకారంతో సిద్దిపేటను ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. పట్టణంలో ముస్లిం మైనారిటీలకు 500 డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలో ఖబరాస్తాన్ ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.15 లక్షల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.