ఖాళీ ప్లాట్లలో చెత్త వేయొద్దని, వేస్తే కాలనీ వాసులే జిమ్మేదారుగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పట్టణంలోని 7వ, 9వ వార్డు ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలందరూ సహకారం అందిస్తే.. స్వచ్ఛ సిద్దిపేటను తయారు చేసుకుందామని మంత్రి ప్రజలకు సూచించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. సిద్దిపేట పట్టణంలో 7వ వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్లకు, అలాగే 9వ వార్డులో రూ.20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మమేకమై మంత్రి మాట్లాడారు.
చెత్త బండొస్తుందా..
రోజూ ఇంటింటికీ చెత్త బండొస్తుందా.. వస్తే ఏ సమయానికి వస్తుందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇస్తున్నారా.. లేదా అంటూ ఆరా తీశారు. 7వ వార్డులో ఓపెన్, ఖాళీ ప్లాట్లలో చెత్త తీయిస్తే.. మరోసారి వేయకుండా మీరు బాధ్యత వహిస్తామని మాట ఇవ్వాలని 7వ వార్డు కాలనీ వాసుల నుంచి మంత్రి మాట తీసుకున్నారు. ఖాళీ ప్లాట్లలో చెత్త లేకుండా క్లీన్ చేయాలని మున్సిపల్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.