రాబోయే రోజుల్లో అన్నివర్గాలకు ఇళ్లు నిర్మించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు (MINISTER HARISH RAO) వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిసాన్‌నగర్‌లో జర్నలిస్టులకు రెండు పడుక గదుల భవన సముదాయాల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు.
దేశంలోనే రికార్డ్ స్థాయిలో జర్నలిస్టులకు ఆక్రిడేషన్ కార్డులు అందించిన ఘనత... తెరాస ప్రభుత్వానిదేనని వివరించారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టుల్ని ఆదుకునేందుకు 42 కోట్లతో సంక్షేమనిధి ఏర్పాటుచేసినట్లు పునరుద్ఘాటించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మిగిలిన 10 శాతం గౌరవెల్లి ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయడానికి 58 కోట్లను కలెక్టర్ నిధికి జమచేసినట్లు వివరించారు. రాష్ట్రంలో పేదవర్గాల ప్రజలకు త్వరలో తమ సొంత స్థలాల్లో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.