మంత్రి హరీశ్ రావు ప్రజాప్రతినిధులతో కలిసి డంప్ యార్డులో భోజనం చేశారు. సిద్దిపేటలోని మిడిల్ ట్రాన్స్పోర్ట్ డంప్‌యార్డును ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సందర్శించారు. క్షణం కూడా నిలబడని చోట సహపంక్తి భోజనాలు చేసేలా అన్ని గ్రామాల్లో డంప్ యార్డులను వినియోగంలోకి తేవాలన్నారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుద్దామని నంగునూరు మండల ప్రజాప్రతినిధులకు హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు.
డంప్‌యార్డులో భోజనం చేసిన మంత్రి హరీశ్‌రావు - సిద్దిపేట డంప్‌యార్డులో బోజనం చేసిన మంత్రి హరీశ్‌రావు
చెత్త అంటేనే.. దుర్వాసన అంటూ ముక్కు మూసుకుని ఆమడ దూరం పోతాం. వాటిని చూడటానికి కూడా మనం ఇష్టపడం. చెత్త పడేయాలన్నా దూరంగా ఉండి పడేస్తాం. కానీ అందుకు భిన్నంగా మంత్రి హరీశ్‌రావు ఏకంగా డంప్ యార్డులో ప్రజా ప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. వర్మీ కంపోస్టు తయారు చేసే విధానం దగ్గరుండి మరీ తెలుసుకున్నారు.
![డంప్‌యార్డులో భోజనం చేసిన మంత్రి హరీశ్‌రావు minister-harish-rao-launch-at-the-siddipet-dump-yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7820225-131-7820225-1593437204698.jpg)
రానున్న రోజుల్లో మీ గ్రామాల్లో కూడా డంప్ యార్డుల్లో వర్మీ కంపోస్టు తయారు చేసే విధానం అమలు చేయాలని మంత్రి ప్రజా ప్రతినిధులకు సూచించారు. పట్టణంలోని నాల్గవ మున్సిపల్ వార్డులో సేకరించిన చెత్తను కంపోస్టుగా మారుస్తున్న తీరుతెన్నులను వార్డు కౌన్సిలర్ మంత్రికి వివరించారు. డంప్‌యార్డులో భోజనం చేసి యార్డు అర్థం మార్చేలా.. అన్ని గ్రామాల్లో ఇదే తరహాలో స్వచ్ఛ సిద్దిపేటకు నాందిగా నిలవాలని సంకేతాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, నంగునూరు మండల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఉపరితల ఆవర్తనం.. ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం