Unani medical camp at Siddipet : యునానీ వైద్యంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ఎన్జీవో భవన్‌లో ఆయూష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత యునానీ మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయూష్ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న హరీశ్... ప్రజలకు నమ్మకం, విశ్వాసం కల్పించి ప్రజాదరణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. యునానీ మందులు ప్రకృతిసిద్ధంగా తయారు చేసినవని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 11న జాతీయ యునానీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయూష్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నో సైడ్ ఎఫెక్ట్స్
Harish rao : యునానీ వైద్యం ఒకప్పుడు ప్రముఖంగా ఉండేదన్న మంత్రి... చార్మినార్ వద్ద ఉన్న వంద పడకల ఆస్పత్రికి పక్క రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి తమ దీర్ఘకాలిక రోగం నయం చేసుకుని వెళ్తారని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు, శారీరక, మానసిక వ్యాధులకు, కీళ్ల నొప్పులు, జీర్ణ కోశ, షుగర్, పక్షవాతం, అలర్జీ, ఆస్తమా తదితర వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... ఒక్క యునానీలోనే వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు ఉచితంగా చికిత్స చేసి.. మందులు అందిస్తున్నట్లు వివరించారు.
సేవలు విస్తృతం చేయాలి..
యునానీ గ్రీకు దేశంలో పుట్టి, నిజాం పరిపాలనతో ప్రాచుర్యంలోకి వచ్చిందని హరీశ్ తెలిపారు. హోమియోపతి, నాచురోపతి, అల్లోపతి, ఆయుర్వేద, యునానీ ద్వారా సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రేపటి తరాలకు ఆయూష్ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా.. బలోపేతం దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయించి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయూష్ విభాగం కింద హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయని... వీటి అభివృద్ధి కోసం రూ.29 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వైద్యులు ఓపీ పెంచి సేవలు విస్తృతం చేయాలని... సమయపాలన పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని... కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.