Harish Rao Comments on BJP: వడ్లు కొనబోమని కేంద్రం చేతులెత్తేస్తే.. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్లధనాన్ని తీసుకొస్తానన్న ప్రధాని మోదీ.. నల్లచట్టాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం హబ్సీపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.
'కేంద్రంలో అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.16 లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీ.. నల్లధనం ఏమో గానీ.. నల్ల చట్టాలను తీసుకువచ్చారు. పెట్రోలు, డీజిల్, ఎరువుల ధరలు పెరగడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినా సరే వడ్లు కొంటామని కేసీఆర్ ముందుకొచ్చారు. మోదీ ప్రభుత్వం ఎంతసేపు రైతులను ముంచే ఆలోచనే చేస్తోంది.'-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
భాజపా అంటే భారతీయ జూటా పార్టీ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలన్నారు. ఆ పార్టీ నాయకులందరివీ మోసపూరితమాటలని విమర్శించారు. ఇప్పటి వరకు రైతుల కోసం కేంద్రం చేసిందేమి లేదని.. తెరాస సర్కారు మాత్రం అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో చేసిందన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే రూ.25 వేల కోట్లు ఇస్తామని మోదీ ప్రభుత్వం ఆశజూపితే.. సీఎం కేసీఆర్ మాత్రం మీటర్లు పెట్టేది లేదని తేల్చి చెప్పారని మరోమారు గుర్తు చేశారు.