చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని.. నేతన్నకు అండగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు(HARISH RAO) అన్నారు. సిద్దిపేటలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)లో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలు, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు.
చేనేత స్టాల్‌లో ఓ చీరను కొన్న మంత్రి... జిల్లా ఉద్యానవన అధికారిణి రామలక్ష్మికి బహుకరించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్, సెరీ కల్చర్ సాగులో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అవిశ్రాంతగా కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా చీరను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నేతన్న చేయూత(nethannaku cheyutha scheme) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతి కల్పించింది. మొత్తం రూ.368 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా రూ.30 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది పొదుపు, ఆర్థిక భద్రతతో కూడిన పథకం. మూడేళ్ల కాల పరిమితితో దీనిని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
చేనేత కార్మికులు తమ వేతనాల నుంచి నెలనెలా 8 శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం దానికి రెట్టింపు.. అంటే 16 శాతం జమ చేస్తుంది. ఇప్పటిదాకా 25 వేల మందికి వర్తిస్తుండగా ఈ కేటగిరీలో తాజాగా రంగుల అద్దకం కార్మికులు, డిజైనర్లు, వీవర్లు, వైండర్లు తదితరులను కూడా చేర్చింది. వారంతా 10 వేల మంది వరకూ ఉంటారు. మరో 16 వేల మంది మరమగ్గాల కార్మికులు కూడా లబ్ధిపొందనున్నారు. వీరు మాత్రం 8 శాతం పొదుపు చేయాలి. ప్రభుత్వం నుంచి అంతే జమవుతుంది. ఇలా.. దాదాపు 51 వేల మంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఇదీ చదవండి:nethannaku cheyutha scheme : నేతన్న చేయూతకు తొలి విడతగా రూ.30 కోట్లు