Bio CNG plant in Siddipet: బయో సీఎన్‌జీ ప్లాంటుతో అనేక లాభాలు ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సీఎన్‌జీ ప్లాంటును హరీశ్ రావు ప్రారంభించారు. స్థానిక బుస్సాపూర్ డంపింగ్ యార్డులో ఈ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఇందులో సూదులు, శానిటరీ ప్లాంట్లు, ఔషధ వ్యర్థాల దహనానికి యంత్రం ఏర్పాటు చేశారు. గతంలో సిద్దిపేట ఎలా ఉండేదో అందరికీ తెలిసిందేనని.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసి తగలబెట్టేవారని హరీశ్ అన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు.
వాణిజ్య అవసరాలకు
'ఈ ప్లాంటుతో చెత్తను వందశాతం సద్వినియోగం చేస్తున్న బల్దియాగా సిద్దిపేట అవతరించింది. పట్టణంలో నిత్యం 30 మెట్రిక్ టన్నుల తడి చెత్త సేకరించి.. బయోగ్యాస్ ఉత్పత్తికి 20 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నారు. సగటున రోజుకు 350 కిలోల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ బయో గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు విక్రయిస్తాం. ఇప్పటికే స్వచ్ఛతలో సిద్దిపేట రాష్ట్ర, జాతీయ స్థాయిలో 18 అవార్డులు సాధించింది. ఈ విజయంలో సఫాయిల పాత్ర కీలకం. చెత్తను వేరు చేసేందుకు ప్రజల సహకారం చాలా అవసరం. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేసినట్లయితే బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియ వేగవంతమవుతుంది.'- హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి