కుక్కల ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేట పట్టణంలో వీధి కుక్కల నియంత్రణ సెంటర్‌ని ప్రారంభించి.. రెండో విడత గొర్రెలకు సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలను గొల్ల కురుమలకు అందించారు. వర్మి కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించిన కార్యక్రమంలో.. జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే కోతుల బాధ నుంచి ఉపశమనం కలిగించామని... వీధి కుక్కల బెడద కూడా లేకుండా చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 60 లక్షల రూపాయలతో ఎనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటి సంతతిని ఆపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అందుకోసం రెండు వాహనాలు, కుక్కలను పట్టడానికి ఆరుగురు వ్యక్తులను నియమించినట్లు తెలిపారు. కుక్కలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాటిని సంరక్షిస్తామని అన్నారు.