తెరాస పార్టీలో చేరికలు ఎప్పుడైనా ప్రజల ముందు, గ్రామాల్లో జరుగుతాయనీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దుబ్బాక ఉద్యమాల గడ్డ అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల వరకు ఇక్కడే ఉండి, అయిపోయాక వెళ్లిపోతారని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే నాయకుడు కావాలా.. అభివృద్ధి చేసే నాయకుడు కావాలా మీరే నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డి పల్లిలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సమక్షంలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక నియోజకవర్గంలోని ఏ మండలానికైనా ఉత్తమ్ వచ్చి ఎవరినీ పలకరించలేదని, కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అది ప్రజలు తెలుసుకోవాలన్నారు.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల కిందట వచ్చి టికెట్ కావాలని అడిగారని... కాంగ్రెస్లో చేరితే తన తండ్రి ఆత్మ క్షోభిస్తుందని మీడియా ముందు చెప్పారని హరీశ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లో చేరారని... తండ్రికి న్యాయం చేయని ఆయన ప్రజలకు ఏం న్యాయం చేస్తారని పేర్కొన్నారు. దేశంలో కేసీఆర్ లాంటి నాయకుడు లేరని చెప్పి.. టికెట్ ఇవ్వకపోతే పార్టీని మారుతారా అని ప్రశ్నించారు.