సిద్ధిపేట నియోజకవర్గంలోని బద్ధిపడగ గ్రామంలో గోదావరి జలాలను ఆహ్వానిస్తూ మంత్రి హరీశ్ రావు జలహారతి పట్టి ఆహ్వానించారు. రంగనాయక సాగర్ నుంచి బద్ధిపడగ గ్రామంలోని ఊరచెరువును గోదావరి జలాలతో నింపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బద్ధిపడగ గ్రామంలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నియంత్రిత సాగువిధానంపై గ్రామ రైతులకు అవగాహన సదస్సు జరిగింది. మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో గ్రామ రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రాధాన్య పంటలే వేస్తామని తీర్మానం చేసి.. మంత్రికి అందించారు. పదవులు శాశ్వతం కాదని.. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన మీ అభిమానం, ప్రేమ శాశ్వతమని మంత్రి అన్నారు. 'మీ అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా మార్చుకుందాం. వ్యవసాయంలో కొన్ని మార్పులు తెస్తున్నాం. నియంత్రణ అంటే.. ప్రాధాన్య పంటల సాగు. సీఎం కేసీఆర్ కల రైతు ఆదాయం పెరగడం, ఆర్థికంగా రైతు బలోపేతం కావడం.. అది ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు.. అందరి కృషి వల్లే రైతు రాజవుతాడు.' అని మంత్రి అన్నారు.
యాసంగిలో మంచి బలువైన, బర్కత్ ఉన్న పంట పండుతుంది. వానాకాలం బదులు యాసంగిలో మొక్కజొన్న వేయాలని రైతులకు సూచిస్తున్నాం. వరిలో సన్న రకం పండించాలని, సన్న రకంలో తెలంగాణ సోనా బియ్యం పండించాలని, ఈ తెలంగాణ సోనా బియ్యం షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు కూడా తినొచ్చని, దిగుబడి కూడా అధికంగా వస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ సోనా సన్నరకం 4 నెలల పంట. ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని రైతులకు మంత్రి అవగాహన కల్పించారు. ప్రతి రైతు తాను పండించే పంట వివరాలను మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని రైతులకు మంత్రి సూచన చేశారు.