Harishrao on Modi: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ... దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే... ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏపీ విభజనపై రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల హృదయాలను గాయపరిచాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భాజపా ఎంతగా వ్యతిరేకిస్తుందో... ఈ ఘటనతో మరోసారి రుజువైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ.. సమైఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి ఎదురైందన్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
'అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉంది. కానీ ఎందుకో మోదీకి నచ్చడం లేదు. అభివృద్ధిలో గుజరాత్‌ను దాటిపోతున్నామనే అక్కసు మోదీలో ఉన్నట్లు కనిపిస్తోంది. వేరుపడ్డాం... బాగుపడ్డామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కాకినాడ తీర్మానం ప్రకారం తెలంగాణ ముందే ఏర్పాటైయుంటే.. మా యువకులు బలిదానాలు చేసుకొనే వాళ్లా.. 2004లోనే తెలంగాణ వచ్చుంటే మా శ్రీకాంతాచారి అమరుడయ్యేవాడా.. యువకుల బలిదానాలకు కారణం.. ఈ భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు. రాజ్యసభలో ప్రధాని మోదీ మాటలు.. తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతోంది.'