కాంగ్రెస్, భాజపా పార్టీలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కరెంటు ఇవ్వక ఇబ్బందులపాలు చేస్తే.. నేడు కేంద్రంలో ఉన్న భాజపా వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు బిగించాలని చూస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని ద్విచక్ర వాహన ర్యాలీ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
మీ ధాన్యాన్ని మీరు అమ్ముకోలేరు..
నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న చట్టాల గురించి సభలో మంత్రి హరీశ్ రావు వాటి ప్రతులను చదివి వినిపించారు. వాటి సారాంశాన్ని క్లుప్తంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తోందన్నారు. కార్పొరేట్ చేతుల్లోకి వెళితే తమ ధాన్యాన్ని తాము అమ్ముకునే వీల్లేకుండా ఉంటుందన్నారు. ఆ సంస్థలు చెప్పిన విధంగానే రైతులు వినే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.