దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి భయంతోనే భాజపా నాటకాలాడుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో దొరికిన నగదుపై భాజపా నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసుల విడుదల చేసిన దృశ్యాలతో అసలు విషయం బయటపడిందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్... కేంద్ర నుంచి విడుదలైన నిధులపై తెరాస విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేకే డబ్బుల పేరుతో భాజపా నేతలు నాటకాలాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.
డిసెంబర్ 9నాడు వచ్చిన తెలంగాణ వెనక్కుపోతే అందరు రాజీనామాలు చేశారు. కానీ భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. ఇయ్యాల తెలంగాణకు నేను వారసుడిని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వస్తే నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల వేస్తమని ఆరేళ్లైంది, ఇస్తామన్న కోటి ఉద్యోగాలు ఎటుపోయాయన్నారు. నిజామాబాద్‌లో తాను గెలిస్తే... పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చాడు. పసుపు బోర్డు వచ్చిందా అని ప్రశ్నించారు. రైతులను మోసం చేసి పదవిలోకి వచ్చిన అర్వింద్... నేడు దుబ్బాక ప్రజలను మోసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు.