Harishrao on Dharani: సీఎం కేసీఆర్ చొరవతోనే దశాబ్దాల భూసమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జగదేవ్‌పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లిలో ఉన్న ఇనాం భూముల్లో సాగు చేసుకుంటున్న పలువురు రైతులకు మంత్రి పట్టాలు పంపిణీ చేశారు. కొన్ని భూములకు ఎలాంటి పట్టాలు లేకపోవడంతో దశాబ్ద కాలం నుంచి చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఆ సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారాన్ని చూపించారన్నారు. సాగు చేసుకుంటున్న భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించామని తెలిపారు. ఈ భూముల వివరాలను ధరణిలో చేర్పించి రైతుబంధు డబ్బులు వచ్చేలా చేస్తామన్నారు.
"ధరణి వచ్చాక భూముల విషయాల్లో అవినీతి తగ్గింది. పాస్‌బుక్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని తప్పింది. పెండింగ్ భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఎరువులతో సహా అన్ని వస్తువుల రేట్లు పెంచింది. దీనివల్ల రైతులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెట్టుబడి పెరిగిపోయింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది." - హరీశ్‌రావు, మంత్రి