కరోనాతో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. వైరస్ నివారణకు మాస్కు, వ్యాక్సిన్ రెండే ఆయుధాలు ఉన్నాయని అన్నారు. కరోనాతో పోరాడేందుకు 45 ఏళ్లు దాటినా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. జలుబు చేస్తే ప్రతిరోజు ఆవిరి పట్టాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భూదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఎన్నో ఏళ్లుగా స్థలం కొని ఇళ్లు కట్టుకున్నవారికి సర్వ హక్కులు ఉండేలా భద్రత కల్పించి పట్టాలు అందించామని మంత్రి పేర్కొన్నారు.
ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించాం: హరీశ్ రావు
ఎన్నో ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కుని ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇచ్చామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భూదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి చేతుల మీదుగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు అందజేశారు.
చెత్తను వాహనాల్లోనే వేయండి:
చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాల్లో వేయాలని కోరారు. ఆకుపచ్చ సిద్దిపేట నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాగ్నోస్టిక్ కేంద్రంలో 56 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని.... కేసీఆర్ కిట్‌తో పాటు అన్నం పెట్టి, తల్లి, బిడ్డను ఇంటి దగ్గర దించుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 150 మంది డాక్టర్లు ఉన్నారని.. సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. కోమటి చెరువు వద్ద మూడు రోజుల పాటు జరగనున్న లేక్ ఫెస్టివల్లో పాల్గొనాలని ప్రజలకు మంత్రి సూచించారు.