ఈ వర్షాకాలంలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు రైతులకు సూచించారు. వరికి బదులుగా ప్రత్తి, కంది పంటలు వేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పండించే పత్తి పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, మంచి ధర పలికే అవకాశముందని హరీశ్ రావు తెలిపారు. గతేడాది కంది పంట క్వింటాలుకు 6 వేల నుంచి 7 వేల రూపాలయలు ధర పలికిందని... ఈఏటా పప్పు దినుసులకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశముందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించి... రైతులు ఈ పంటలవైపే మొగ్గు చూపే విధంగా చేయాలని మంత్రి సూచించారు.
వెదజల్లే పద్ధతితో ఎన్నో లాభాలు
ఈ వానకాలానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వానకాల సాగు సమాయత్త ఏర్పాట్లపై చర్చించారు. వరి పండించే రైతులు నారు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయాలని హరీశ్‌రావు సూచించారు. ఈ విధానంలో 6 నుంచి 7 వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుందన్నారు. అదేవిధంగా విత్తన మోతాదు 10-12 కేజీల సరిపోతాయన్నారు. ఖర్చు ఆదా అవడమే కాకుండా కూలీల కొరతా తీరుతుందని, పంట 10 నుంచి 15 రోజుల ముందుగానే కోతకు వస్తుందని తెలిపారు. దిగుబడి 10 నుంచి 15 శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న వెదజల్లే పద్ధతిపై వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.