మారుతున్న పరిస్థితులకు, మార్కెట్‌కు అనుగుణంగా రైతులు మారాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతులు సంఘటితంగా మారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు గడించవచ్చని హరీశ్‌రావు వివరించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు ప్రోత్సాహం, భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మాచాపూర్, చౌడరం గ్రామాల్లో సభ్యత్వం పొందిన 750 మంది రైతులకు సన్‌ఫ్లవర్ విత్తనాలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే లక్ష్యం..
రైతు ఉత్పత్తిదారుల సంస్థ- ఎఫ్‌పీఓ కార్యక్రమాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని, రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే దాని ఉద్దేశమని మంత్రి వివరించారు. పంటమార్పిడి విధానంలో భాగంగా చిన్నకోడూర్ మండలంలో వెయ్యి ఎకరాలకు పొద్దు తిరుగుడును సాగు చేయనున్నట్టు తెలిపారు. దీని వల్ల రైతులకు నేరుగా మద్దతు ధర వస్తుందన్నారు. పొద్దు తిరుగుడు పువ్వు, తేనేటీగల పెంపకం ద్వారా వచ్చే లాభాల గురించి 700 మంది రైతులకు విడతల వారీగా రైతు వేదికలో రోజూ శిక్షణ జరపాలని ఆయా సంస్థ శాస్త్రవేత్తలు, ప్రతినిధులను మంత్రి కోరారు. యాసంగిలో సన్‌ఫ్లవర్ పంటలకు మంచి దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు రైతులను చైతన్య పర్చాలని సూచించారు.