సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గొనెపల్లిలో మంగళవారం నిర్వహించిన ప్రాధాన్య పంటల సాగు సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. గతేడాది వానాకాలంలో 8500 ఎకరాల్లో మొక్కజొన్న వేశారని, ఈసారి వరి, కంది పంటలను వేయాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. వానాకాలంలో మొక్కజొన్న పంట వేస్తే కత్తెర పురుగు సోకి దిగుబడి తగ్గుతుందని మంత్రి తెలిపారు. పైగా బూజు పట్టి మొలకెత్తకుండా ఉంటుందని వచ్చే నష్టాలను రైతులకు సవివరంగా మంత్రి వివరిస్తూ... వానాకాలం బదులుగా యాసంగిలో మొక్కజొన్న వేయాలని ప్రభుత్వం సూచిస్తోందని ఆయన చెప్పారు. యాసంగిలో వరి పంట తగ్గించి, మొక్కజొన్న పంట వేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని అన్నదాతలకు సూచించారు. గొనెపల్లి గ్రామంలో అధికంగా దొడ్డు రకం వరి పండించి, సన్న రకం బియ్యం బయట కొనుక్కొని వస్తున్నారని, ఆ సన్న రకం పంటలు గొనెపల్లిలోనే పండించాలని రైతులు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.
రైతులు ప్రాధాన్య పంటలు సాగు చేయాలి: మంత్రి హరీశ్ - telangana agriculture policy
ప్రత్యామ్నాయ ప్రాధాన్యత పంటలు సాగుచేసి రైతులు లక్షలు సంపాదించాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గొనెపల్లిలో నిర్వహించిన ప్రాధాన్య పంటల సాగు సమావేశానికి మంత్రి హాజరయ్యారు. రైతులు వానాకాలంలో వరి, కంది పంటలను సాగు చేయాలని సూచించారు.
వ్యవసాయ రంగానికి మేలు చేయడంతో పాటు సాగును లాభసాటిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఆర్థికమంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. వానా కాలం-2020 ప్రాధాన్యత పంట సాగుకు చిన్నకోడూర్ మండలంలోని 25 గ్రామాలకు గానూ 15 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయని, మిగతా 10 గ్రామాలు ఇంకా ఎందుకు కాలేదని స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి ఆరా తీశారు. చిన్నకోడూర్ మండలంలోని ప్రతీ క్లస్టరులో రైతు వేదికల నిర్మాణం జరగాలని, మండలంలో 8 క్లస్టర్లు ఉన్నాయని, సరైన స్థలాల్లో ఎంపిక చేసి 4 రోజుల్లో త్వరితగతిన నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, ఏఈఓలు సమన్వయంతో ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. వానాకాలంలో వేయనున్న ప్రాధ్యాన పంటల సమగ్ర వివరాలను ఏఈఓలు, ఆయా గ్రామ రైతుబంధు సమన్వయకర్తల నుంచి క్షుణ్ణంగా మంత్రి ఆరా తీశారు.
ఇవీ చూడండి: ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్