కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దుబ్బాకకు గోదావరి జలాలు తీసుకొచ్చామని... త్వరలోనే కాల్వలను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాబోయే మూడేళ్లలో తప్పకుండా ప్రతి హామీలను అమలుచేస్తామని వెల్లడించారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టునైనా భాజపా నేతలు తెచ్చారా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గెలిస్తే పసుపుబోర్డు తెస్తామని బాండు పేపర్లు ఇచ్చారు కదా.. మరి ఎందుకు తేలేకపోయారన్నారు.
గొర్రెల యూనిట్ ధర ఎంతో కూడా అవగాహన లేని భాజపా నేతలు జూఠా మాటలు చెబుతున్నారని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. గొర్రెల పథకంలో ఒక్క రూపాయి కూడా కేంద్రానిది లేదని పేర్కొన్నారు.
దుబ్బాకకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరైతే నేను సిద్దిపేటకు తీసుకెళ్లినట్లు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. విద్యుత్ విషయంలో కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని... రైతులకు 24 గంటలపాటు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. వ్యవసాయ పంప్‌సెట్లకు కేసీఆర్ మీటర్లు పెడుతున్నారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
భాజపా నేతల ఇళ్లలో డబ్బు దొరికితే నాటకాలు ఆడారన్న మంత్రి హరీశ్... ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారని విమర్శించారు. పోలీసులే డబ్బు పెట్టినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని... అబద్ధాల పునాదులపై దుబ్బాకలో గెలవాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి:వచ్చే వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం: మంత్రి గంగుల